సౌరమానం: ఈ వారం రాశి ఫలితాలు

రాశి ఫలాలు – 2018  

జన్మనక్షత్రం తెలియదా?  నో ప్రాబ్లమ్‌!  మీ పుట్టినరోజు తెలుసా? మీ పుట్టిన తేదీని బట్టి ఈవారం (ఆగస్టు 18 నుంచి 24 వరకు) మీ రాశి ఫలితాలు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)

లక్ష్మీదేవి, ఆమె అక్క జ్యేష్ఠాదేవీ ఒకేమారు ఇంటికొచ్చి రుక్మిణీదేవిని అడిగారట– మా ఇద్దరిలో ఎవరు బాగా ఉంటారు? సౌందర్యవతులని. లక్ష్మీదేవి ఐశ్యర్యాన్నిచ్చేదౌతుంటే, దారిద్య్రాన్నిచ్చే దేవత జ్యేష్ఠాదేవి. అందుకని రుక్మిణీదేవి ‘‘లక్ష్మీదేవి వస్తుంటే సౌందర్యవతిగా అనిపిస్తోంది. జ్యేష్ఠాదేవి వెళ్తూంటే చెప్పనలవి కాని అందగత్తెలా ఉంటుంది’’అందిట. ఇలా చాకచక్యంగా తప్పించుకోవలసిన పరిస్థితులు మీకు ఈవారం రాబోతున్నాయి. ముఖ్యంగా ఇటు భార్య, అటు తల్లి, ఇటు భర్త, అటు అత్తల మధ్య. కొద్దిగా బుర్ర పెడితే చాలు అంతా అనుకూలమే మీకు.

‘ఎంచి ఏట్లో వెయ్యి’ అని ఓ సామెత ఉంది. నువ్వు వ్యర్థంగా వ్యయం చేసినప్పటికీ, తప్పనిసరిగా ఖర్చు చేసినప్పటికీ ఎలా ఖర్చు అయిందో దాన్ని ఒకచోట రాసి ఉ ంచడం అవసరమని లోకానుభవం చెప్తుంది. ఇది ఇప్పుడర్థం కాకపోవచ్చునేమోగాని ధనం అడుగంటిన వేళ ఈ లెక్కలు చక్కని ఉపదేశాన్నిస్తాయి మీకు గమనించుకోండి. ఆర్థికమైన లావాదేవీల్లో ప్రమత్తత, బద్ధకమూ వద్దు.  

ఎంత కాదని అనుకున్నా ఇల్లు మొత్తం గృహిణి మీదే ఆధారపడి ఉంటుందనేది సత్యం. ఆమెకి మనస్తాపం లేదా ఆరోగ్య భంగం గాని కలిగితే ఒంటికాలితో నడవ వలసిన చందం అవుతుంది కాబట్టి భర్తలు తీవ్ర కాఠిన్య ధోరణిలో మాట్లాడడం, అలాంటి ప్రవర్తనతో ఉండడం సరికాదు. మానసిక అనారోగ్యం శారీరక అనారోగ్యంగా పరిణమించి మీ దైనందిన ప్రణాళికని దెబ్బతీస్తుంది. ఆలోచించుకోండి! న్యాయస్థానంలో ఉన్న లావాదేవీలూ అభియోగాలూ ఎదుగుదల ధోరణిలో వెళ్లకుండా రాజీమార్గాలని కొంతలో కొంత ఆశ్రయించడం ఎంతైనా మంచిది.

లౌకిక పరిహారం: భార్య ఆరోగ్యాన్ని చూసుకోక తప్పదు. మనసుని గాయపరచద్దు.
అలౌకిక పరిహారం: ఆదిత్య హృదయ స్తోత్రమే మీకు తరుణోపాయం.

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)

మార్గంలో వెళ్తూంటే చెట్టుకొమ్మ ఏదైనా తలకి తగిలే లా ఉందన్నప్పుడూ ఏదైనా ఇంటికి వెళ్లినప్పుడు ద్వారబంధం ఎత్తు తక్కువగా ఉందన్నప్పుడూ తలని వంచి వెళ్తాం. దాన్ని అవమానంగా భావించం. అదే తీరుగా ప్రస్తుతం జరుగుతున్న దశలో ఓ మెట్టుదిగి మాట్లాడడం, కొద్దిగా తల వంచి ప్రవర్తించడమనేది మీ తక్కువదనాన్ని అంగీకరించినట్లు కాదు– రాబోయే విజయాన్ని మౌనంగా ఆహ్వానించుకుంటున్నట్టు.

మీదే ఓ సంస్థలో ఉద్యోగంలో అధికారిగాని అయినట్లయితే, ‘సమయపాలన’ తప్పనిసరి అని భావించండి. మీ మాటకి మీ పై అధికారులు తగినంత విలువని ఇవ్వకపోవచ్చు– అవమానమనుకోకండి. ప్రస్తుతం 3వ ఇంట బుధుడున్న కారణంగా మీరు చెప్పే ఉపాయం లేదా సూచన కచ్చితంగా అనుకూలించదు. ఒక్కమాటలో చెప్పాలంటే– చెప్పింది చెయ్యండి. అతి ముఖ్యమైన విషయంలో మీరే చెప్పవలసి వస్తే– అడిగి చెప్పండి తప్ప సొంతంగా చెప్పకండి. ఈ మ Üూచనని ఈ నెలవరకూ పాటించక తప్పదు.  మీరుంటున్న ఇంటిని మారదలిస్తే మంచిదే. రాబోయేది భాద్రపదం. శూన్యమాసం కాబట్టి, వె ంటనే నిర్ణయించుకోవడం మంచిది.

శని 8వ ఇంట ఉన్న కారణంగా మీ భార్య/భర్తకి తాత్కాలిక అనారోగ్యం కలగచ్చు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టు పెద్ద వైద్యుడూ చికిత్స అనుకోకుండా, ఒకట్రెండు రోజులు ఆహార వ్యవహారాల్లో జాగ్రత్తని పాటిస్తే చాలుననుకోండి. చెప్పుకోదగ్గ అనారోగ్యం లేనే లేదు. సముద్రంలో కెరటాలు నిరంతరం ఇస్తూ ఉండేటట్లూ, వాయువు దట్టంగానో, తేలికగానో వీస్తూ ఉండేటట్లూ ఏదో ఒక అపార్థం వివాదం వచ్చే అవకాశం ఉంది కాబట్టి లౌక్యంగా వ్యవహరించి వివాదంలోకి అడుగేయండి. చేసే పనిలో మాత్రం ఏకాగ్రతని విడవకండి. పరాజయం ఏమాత్రమూ ఏ విషయంలోనూ లేదుగాని అప్రమత్తత అవసరం.

లౌకిక పరిహారం: సొంత నిర్ణయాలని బాగా ఆలోచించి మాత్రమే తీసుకోండి. వివాదాలు వద్దు.
అలౌకిక పరిహారం: శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ అవసరం.

మిధునం (మే 21 – జూన్‌ 20) 

ఇంద్రుడు మన్మథుని దగ్గరికొచ్చి పొగిడాడు బాగా. దేవతలకి అధ్యక్షుడైన ఇంద్రుడంతటివాడు, తనని పిలిచి మాట్లాడగల అధికారం ఉన్నవాడు, ఆయనంత ఆయనగా తన దగ్గరకొచ్చేసరికి ఉబ్బి తబ్బిబ్బయిన మన్మథుడు కాస్తా కరిగిపోయాడు ఆనందంతో. తీవ్రమైన వైరాగ్యమున్న శంకరుడికైనా నా బాణాలతో స్త్రీ ఆసక్తి కలిగిన శృంగారిగా చేస్తానన్నాడు. అందుకే వచ్చానన్నాడు ఇంద్రుడు. ఫలితంగా మన్మ థుడు భస్మమయ్యాడు. గుర్తుంచుకోండి ఈ కథని. మీకు అధికారిగా లేక శ్రేయోభిలాషిగా లేదా పరమ ఆప్తునిగా ఉండే ఎవరో ఒకరి ద్వారా ఈ తీరు ఇబ్బందికి ఆర్థికంగా లేదా మాట సహాయపరంగా గురి కావలసి ఉన్నారు. కాబట్టి పొగడ్తలకి బుట్టలో పడకండి.

ముఖ్యంగా సొమ్ముని అప్పుగా ఇయ్యడం, హామీ పత్రాల మీద సంతకాలు చేయడం, అడ్డు ఉండి మీ మాట మీద అప్పులిప్పించడం వంటివి మొహమాటానికి పోయి చేసినట్లయితే మరో రెండు సంవత్సరాలపాటు సత్కాలక్షేపమే (చిక్కులు) అని గుర్తుంచుకోండి. కొత్త వ్యాపారాన్నీ వృత్తినీ చేపట్టడానికి ఇది సమయం కాదు. అవతలి వ్యక్తి మిమ్మల్ని భాగస్వామిగా చేసుకోవాలని తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తూ ఉండచ్చు.

నిస్సందేహంగా నిర్భయంగా మనసులో ఉ న్న మాటని ‘సాధ్యపడద’ని చెప్పెయ్యండి తప్ప నాన్చడం, సగం సగం మాట్లాడడం, చూద్దామని తాత్కాలికంగా తప్పించుకోవడం... సరికాదు.  నూతన స్త్రీ పరిచయం ఏర్పడే అవకాశముంది. అపవాదూ దీనితోపాటు ధననష్టం దానికి తోడు ఆమె సరికానిది కచ్చితంగా అయిన కారణంగా న్యాయస్థాన వివాదం దాకా వ్యవహారం వెళ్తుంది. స్త్రీ పరిచయం ఏమాత్రమూ సరికాదు. చారుదత్తమనే సంస్కృతిక నాటికలో అంటాడు– స్త్రీని పరిచయం చేసుకోవడం తేలిక కావచ్చు కాని, వదిలించుకోవడం అంత తేలిక కాదు– ప్రమాదకరం అని. ఇది గుర్తుంచుకుని ప్రవర్తించండి.  అనుకున్న పనుల్లో అడ్డంకులొచ్చినా దిగులు పడకండి. పనులు ఆలస్యమౌతాయి. (నాల్గింట బుధ రాహువుల కారణంగా) తప్ప పూర్తి కాకుండా ఉండవు.

లౌకిక పరిహారం: స్త్రీ పరిచయాలు వద్దు. ఆర్థిక విషయంలో జాగ్రత్త తప్పనిసరి.
అలౌకిక పరిహారం: లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠిస్తూ ఉండండి.

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)

మీ శత్రువులు వింటున్నారని మీకు చెప్పకుండా– కనీసం మీరు గుర్తించలేని తీరుగా కూడా చేస్తూ మీ శత్రువుల గురించిన విరోధాభిప్రాయాలని మీ చేత చెప్పిస్తారు– మీకు అనుకూలంగా ఉన్నట్లు నటిస్తున్న ఆప్త శత్రువులు. పెదవి దాటిన మాట పృథివి దాటిపోతుందన్న సామెతను బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటివరకూ అలాంటిది జరగలేదు కానీ ఏ క్షణంలోనైనా జరిగే అవకాశముంది కాబట్టి ఇతరుల గురించిన అభిప్రాయాలు మనకనవసరమనుకోకండి. అభిప్రాయాన్ని అడిగితే మౌనంగా ఉండండి. పరాకులో ఉన్నట్టుండండి.

వాహనంగాని నిత్యం మీకు ప్రయోజనపడే ఏదైనా యంత్రంగాని మరమ్మతుకి రావచ్చు– అనుకున్నదానికంటె మించిన వ్యయాన్ని మీకు కలిగించవచ్చు. వీలైనంత జాగరూకత తప్పనిసరి. బంధుమిత్రుల రాకతో ఇల్లంతా హడావుడిగా ఉండచ్చు కాబట్టి మాటలో నిదానం పలుకుల్లో మృదుత్వం వ్యవహారంలో సూటితనం అవసరం. బంధుమిత్రుల్ని చక్కగా ఆదరించండి. శుక్రగ్రహం సరిగా లేని కారణంగా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయనే కూడదు. ముఖ్యంగా మోకాలి నొప్పులు, కీళ్ల బాధలు, బరువుల్ని మోయలేనితనం, విసుగుదల... తప్పనిసరిగా ఉంటాయి.

మిమ్మల్ని ఎదురు చూస్తున్న పనులెన్నో మీకు ఉండే కారణంగా ఏ పనికీ పూర్తి న్యాయాన్ని మీరు చేయలేకపోతారు.  విదేశీయానం కోసం చేసిన ప్రయత్నం తొందరల్లో ఫలించబోతోంది. అయితే తప్పనిసరి అయిన కొన్ని కుటుంబ పరిస్థితులు మిమ్మల్ని విదేశాలకి వెళ్లనీయకపోవచ్చు. ఉద్యోగంలో మీరు వేతనాధిక్యంతో పాటు ఉద్యోగంలో పదవీ ఉన్నతిని కూడా ఆశిస్తూ పోటీ పరీక్షలకి సిద్ధ పడితే తప్పక విజయాన్ని పొందగలుగుతారు. ప్రయత్నించండి. తప్పనిసరిగా విలాస వస్తువుల్నీ వినోదయాత్రల్నీ చేయక తప్పని పరిస్థితి రావచ్చు. కాబట్టి కొంత ద్రవ్యం ఖర్చవుతుందని సిద్ధపడండి. మానసికంగా, శారీరక శ్రమకి కూడా Ðð నుకాడకండి.

లౌకిక పరిహారం: పోటీ పరీక్షలకి సిద్ధంకండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి.
అలౌకిక పరిహారం: హనుమత్‌ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి.

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)

అతిథులని బట్టి అన్నం; పిండి కొద్ది రొట్టె; రోలుని బట్టి రోకలి; రౌతుని బట్టి గుర్రం... అనే ఈ తీరు సామెతలని మనం విన్నాం. అలాగే ఎంత ఇంటికి ఖర్చవుతుందో గమనించుకుని దాన్ని బట్టి మన ఆదాయంలో ఓ ప్రణాళిక ప్రకారం ఖర్చు చేసుకోవాల్సిందే! లేని పక్షంలో ఋణానికి వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చు. లోగడ మీకున్న చిన్న అపఖ్యాతి (సకాలంలో అప్పుని తీర్చడు – వాయిదాలు వేస్తాడు) కారణంగా అప్పు కూడా పుట్టకపోవచ్చు.

తెలిసి తెలిసి బురదలో దిగడం దేనికి? గమనించుకోండి! మీకు అదృష్టకరమైన అంశమేమంటే మీ పరిస్థితి మీ సంతానానికి పూర్తిగా తెలియడం, తెలిసి అర్థం చేసుకునే దశలో వాళ్లు ఉండి మీకు ఆర్థికంగా ఇబ్బందిని కలిగించే విలాస వినోద క్రీడా వస్తువులని కొనాల్సిందే! అని తోటి వయసువాళ్లతో సమానంగా అడక్కుండా ఉండడమే.

మూలాధారంగానూ బలమైన అండగానూ మీకు నిలిచే ఓ ప్రధాన వ్యక్తి అనారోగ్యంతోనో లేక చితికిపోయి ఉన్నతనంతోనో మీకు ఏవిధమైన సహాయమూ చేయలేని స్థితిలో ఉండచ్చు కాబట్టి మీకు మీరే జాగ్రత్తగా నడిచి తీరవలసిందే! వ్యయంలో ఉన్న బుధుడూ రాహువూ మీకు ఈ తాత్కాలిక ఉపద్రవాన్నీ తద్వారా మానసిక అశాంతినీ కలిగిస్తారు.

అయితే రవిగ్రహం కారణంగా ఊహించినంత బాధకి గురి కారు.ఉద్యోగం చేస్తూండేవారికి మరో ప్రదేశంలోని ఉద్యోగ బాధ్యతలని కూడా అప్పగించే కారణంగా జంట గుర్రాల స్వారీలాగా ఇటు ప్రయాణాలు అటు జంట బాధ్యతలూ వల్ల ఇంటిని దాదాపుగా పట్టించుకోగల అవకాశం ఉండకపోవచ్చు. ఆ కారణంగా భార్య, సంతానం మీకు సహకరించవలసిందేనని ప్రార్థనాపూర్వకంగా చెప్పండి. అర్థం చేసుకోగలవాళ్లే మీ కుటుంబసభ్యులు. మానసిక ఆందోళనకి గురి కావద్దని నిత్యం ధైర్యం చెప్తూండండి మీ ధర్మపత్నికి. ఇది అవసరం.

లౌకిక పరిహారం: వ్యయం విషయంలో  ప్రణాళిక తప్పదు. బాధ్యతలు పెరుగుతాయి. సిద్ధపడక తప్పదు.
అలౌకిక పరిహారం: శ్రీ లలితా సహస్రనామ పారాయణ మంచిది.

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)

‘చల్లగా గాలి వీస్తోం’దని ఆనందపడతాడు తీవ్రంగా శ్రమించి ఒళ్లంతా చెమటలు పట్టిన కార్మికుడు. దేవుడి దగ్గర దీపాన్ని వెలిగించి నమస్కరిస్తూంటే ఈ గాలి ఏమిటి? వీచి దీపాన్ని కాస్తా ఘనం అయ్యేలా చేసింది! ఏ అశుభం జరుగుతుందోననుకుంటాడు భక్తుడు. జ్వరంతో బాధపడుతున్నవాడు అసలు గాలి అనేదే వీచకుండా ఉంటే బాగుండుననుకుంటాడు! అర్ధాష్టమం (8/2=4)లో శని ఉన్న కారణంగా కొన్ని ఇబ్బందులు తప్పవు. అయితే కొన్ని విషయాల్లో ఆనందాలూ కలుగుతాయి.

అంటే మిశ్రమ ఫలితాలుంటాయని కదా అర్థం! అన్నిటికంటే గమనించ వలసిందేమంటే పరాజయం, అవమానం, అపకీర్తి అనేవి ఉండవని. ఉద్యోగం చేస్తున్నవారికి తీవ్రమైన ఒత్తిడి తప్పదు. ఆ కారణంగా సహన శక్తితో ఉండగలగాలి. ‘నిమ్మకి నీరెత్తినట్టు’ అని ఓ సామెత ఉంది. ఆ కారణంగా ‘ఇప్పుడో పెద్ద పనిని నేను చేయాల్సి వస్తుం’దనే దృఢాభిప్రాయాన్ని ముందుకి ముందే మనసుకి చెప్పుకుని కంగారుపడనే కూడదు. చాలామంది అధికారులు పొరపాట్లు చేసేది ఒత్తిడి కారణంగానే. అదృష్టకరమైన అంశమేమంటే – మీ చేత ఎలాగైనా పొరపాటు చేయించాలనే మనస్తత్వం, పగ, ద్వేషం కలవాళ్లు మీకు లేకపోవడమే.

కాబట్టి మీకు మీరు తొందరతో ఉచ్చులో పడకుండా నిదానంగా పనిని చేయండి. బుధుడు, రాహువు కలిసి ఉన్నందువల్ల ఇంటి విషయాల్లో  అలాగే మీరు కొన్న స్థలాల విషయంలో కొంత జాగ్రత్తతో ఉండాలి. అంటే పత్రాలు సక్రమంగా ఉండేలా చూసుకోవడం, భద్రంగా దాచిందీ లేనిదీ చూసుకోవడం, దాంతో పాటు ఏవైనా కాగితాల్ని తెచ్చుకోవాల్సి ఉంటే వాటిని ఆ కాలంలో తెచ్చుకుని ఉండని పక్షంలో ప్రయత్నించి తెచ్చేసుకోవడం చేయాలన్నమాట! అదే తీరుగా సొమ్ము తీసుకుని ఎవరికైనా ఇయ్యని పక్షంలో తీర్చివేయడం గాని, ఫలాని నాటికి తీరుస్తానని చెప్పడం, తప్పక తీర్చేయడం చేసెయ్యాలి!

లౌకిక పరిహారం: నిదానమే ప్రధానం. తొందరపడద్దు. అపజయం లేదు.
అలౌకిక పరిహారం: నవగ్రహ స్తోత్రాన్ని రోజూ పఠించండి.

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)

అతి పరిచయాదవజ్ఞా సంతత గమనాదనాదరః – ఎక్కువ పరిచయాన్ని చేసుకోవడం, ఖాళీ అనిపిస్తే వెంటనే మాట్లాడుతూ ఉండడం, తీవ్రంగా మమేకమన్నట్లుగా ఉండడం మంచిది కాదంది శాస్త్రం. అదే తీరుగా ఎక్కువ కాలం ఒకేచోట (తన స్థానం కానిచోట) ఉండడం కూడా గౌరవాన్ని తగ్గించేందుకు కారణమే ఔతుందంది శాస్త్రం. అష్ట కష్టాల్లో ఒకటిగా – మరొకరి ఇంట ఉండడం – అనేదాన్ని చెప్పింది అదే శాస్త్రం. తప్పుగా భావించవద్దు గాని అత్తింట్లో ఉండాల్సిన ఆడపిల్ల పుట్టింట్లోనే ఏ కారణాలతో ఉన్నా ఈ మానసికబాధని ఈ కాలంలో అనుభవించవలసి వస్తుంది.

పరిస్థితిని గమనించుకుని సొంత కాళ్లమీద నిలబడాలనే ఉద్దేశ్యంతో ఉద్యోగ ప్రయత్నాన్ని చేసినా కూడా కుజ, కేతువులు కలిసి ఉన్న కారణంగాను, ఇతర గ్రహాల అననుకూలత కారణంగానూ ఫలించకపోవచ్చు. ఒక మెట్టు దిగి రాజీ మార్గాన్ని ఆశ్రయిస్తే దాంపత్యంలో వచ్చిన సమస్య గాలికి దట్టమైన మేఘం కూడా ఎలా పారిపోతుందో అలా అయ్యే అవకాశముంది. మీరు ప్రయత్నం చేయడమే తరువాయి. మీ చేతిలోనే ఉంది తాళపు చెవి. గమనించుకోండి! మానసిక అశాంతే శరీరమ్మీద ప్రభావాన్ని చూపిస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది.

ఆ కారణంగా నరాల బలహీనత, ఎముకలలో నొప్పులు, శిరోవేదన ముఖ్యంగా కంటి బాధ కలిగే అవకాశముంది. ఇవే గనుక ఉంటే ఇవన్నీ మానసిక అశాంతి కారణంగా లభించిన పరిణామాలుగా గుర్తించండి. ప్రయాణానికి బయలుదేరినా ఉరుములూ మెరుపులూ తీవ్ర స్థాయిలో వర్షం... వంటివి వస్తే ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడమో, మానివేయడమో లేక మధ్యలో ఎక్కడనో ఆగిపోవడమో చేస్తున్నామా? లేదా? ఏమైనా ప్రయాణాన్ని కొనసాగించాల్సిందే అనుకుంటే ఏమౌతుంది? పరిస్థితిని బట్టి మెట్టు దిగడం మంచిది.

లౌకిక పరిహారం: ఇతరుల సూచనలు సలహాలు ఇచ్చినా పడాల్సిన కష్టం మీరు గమనించుకుని ఓ మెట్టు దిగండి.
అలౌకిక పరిహారం: దుర్గా స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి.

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)

ధనం ఉంది. ధాన్యం గాదెల నిండుగా ఉంది. నగలూ నట్రా ఉన్నాయి. పలుకుబడి ఉంది. సంఘంలో గౌరవముంది. కొదవ అనేది ఏ విషయంలోనూ లేదు. మాట్లాడగల నేర్పరితనం ఉద్యోగ వ్యాపారాల్లో ప్రథమ స్థానం సంపాదించిన – సంపాదించగల చరిత్ర ఉంది. అయితే జీవిత భాగస్వామి/ని విషయంలో ఐక్యం అనేది లేదు. దూరదూరంగా ఉండడమో, దగ్గరే ఉన్నా ఇద్దరికీ ఒకతనం (ఐక్యాభిప్రాయం) లేకపోవడమో వల్ల చెప్పలేని మానసిక అప్రశాంతతో ఉంటారు. తీవ్ర నిరాశతోనూ ఉంటారు కూడా.

చాప కింద నీరులా – ఎండుటాకుల కిందుగా పరుగెత్తుకుపోతున్న పాములా – కనిపించకుండా పేరుకుపోతున్న మేఘపు తునకల్లా – మీలో అనారోగ్యం రోజురోజుకీ పెరుగుతూ వెళ్తోంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టు ఒక్కసారి సంపూర్ణ ఆరోగ్య పరీక్షలకి వెళ్లడం అత్యవసరం. ఇది భయపెట్టేందుకు చెప్పేది కాదు – ముందు జాగ్రత్త కోసం మాత్రమే.

గురు గ్రహం అనుకూలంగానూ, కేతువు కూడా సరైన తీరులోనూ ఉండని కారణంగా ఈ పరిస్థితులుంటాయి. వివాహం దాదాపుగా నిశ్చయమయ్యుంటే అది వాయిదా పడుతూ వెళ్లచ్చు. లేదా మీరింకా ఆ సంబంధం గురించే ఆలోచిస్తుంటే ఏ కబురూ కాకరకాయా లేకుండా అవతలివారు వివాహాన్ని చేసేసుకుని కూడా ఉండచ్చు. అలాగే చదువు విషయంలో ఆశించిన ఫలితం ఉండకపోవచ్చు. మీకు ఏమాత్రమూ ఇష్టమే లేని చదువులో ప్రవేశం మీకు లభించవచ్చు. కొద్దికాలం అగితే సరైన ఫలితం సరైనచోట విద్యాప్రవేశమూ జరుగుతాయనేది నిశ్చయం. వర్షం వచ్చేప్పుడు ఏ ఇంటి పంచలోనో ఒక్క క్షణం నిలబడ్డట్టు వర్షం తగ్గడం కోసం ఎదురుచూస్తున్నట్టూ కొద్దికాలం ఎదురు చూడండి. విజయం తథ్యం.

లౌకిక పరిహారం: మానసిక అప్రశాంతత తప్పదు. ఉత్సాహవంతులతోనే మెలగండి.
అలౌకిక పరిహారం: శని శ్లోకాన్ని రోజుకి 361 మార్లు చదువుతూ ఉండాల్సిందే.

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)

‘ఆ ఊరి దూరం ఇన్ని మైళ్లు. గంటకి  వేగం ఇంత. కాబట్టి ఆ ఊరికి ఇన్ని గంటల్లో వెళ్లిపోగలం’ అనేది గణితశాస్త్రం చెప్పే మాట. మరి వాహనం ఉన్న స్థితి, వాహనాన్ని నడిపే వాని ఆలోచన, నేర్పరితనం, మార్గంలో ఉండే ఎత్తుపల్లాలూ గతుకులూ మరో మార్గంలో వెళ్లాల్సిన పరిస్థితులూ వంటివేమీ ఆ శాస్త్రానికి అవసరం లేదు. జన్మ శని, రెండవ యింట కుజ కేతువులూ... ఇలా ఉన్న కారణంగా మీ అంచనా ప్రకారం ఏదీ జరగదు. అన్నీ కూడా మరోలా జరుగుతూ ఉంటాయి. ఇలాగని భయపడుతూ కూర్చోనక్కరలేదు. వాహనం సకాలంలోనైతే చేరే వీలులేదు గాని ప్రమాదంలో చిక్కుకోకుండా ప్రయాణిస్తూ గమ్యానికి చేరినట్లు మీ అంచనాలు తప్పుతూ సకాలంలో కాకుండా అకాలంలో విజయాన్ని సాధిస్తారనేది నిశ్చయం.

సమస్యలు వచ్చినప్పుడు దైవాన్ని ప్రార్థిస్తాం. దానితో పాటు లౌకికంగా అనుభవజ్ఞులూ పెద్దలూ మీరున్న రంగంలో విశేష ఖ్యాతిని ఆర్జించినవారూ మీకు తెలిపే ఉంటారనేది యదార్థం. కాబట్టి అవమానమనుకోకుండా అభిమానపడకుండా వారిని సంప్రదించండి. చక్కని పరిష్కారం లభించి తీరుతుంది. ఎంతటి బలవంతుడైనా వర్షం వస్తే గొడుగుని తెరవాల్సిందే. సముద్రాన్ని దాటాల్సి వస్తే నౌకని ఆశ్రయించాల్సిందే.ఎందుకైనా మంచిది. కొంత సొమ్ముని చేతిలో ఉంచుకోవడం ఉత్తమం.

అనారోగ్యం లేదా వాహనం మరమ్మతు లేదా చుట్టాల రాక కారణంగా అకస్మాత్తుగా ఖర్చు అదనంగా చేయాల్సిన అవసరం గోచరిస్తుంది కాబట్టి. భర్త/ భార్య ఉద్యోగం, వ్యాపారం, సంస్థలో జరుగుతున్న ఇబ్బందులని గురించి వివరంగా చెప్పుకోవడం ఉత్తమం. మొత్తమంతా ఇద్దరికీ తెలియడం ఎంతైనా మంచిది. గోప్యత కూడదు కూడదు.

లౌకిక పరిహారం: భార్య/ భర్తల మద్య దాపరికాలు ఏమాత్రమూ సరికావు.
అలౌకిక పరిహారం: లక్ష్మీ అష్టోత్తరాన్ని రోజూ పఠిస్తూ ఉండండి.

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)

అడవిలో వెళ్తూంటే నిష్కారణంగా పాములూ, పులులూ, సింహాలూ, తోడేళ్లూ ఇతర హానికర క్రిములూ ఎలా మనసులో మనకి మెదులుతూ ఏ అపకారాన్ని తలపెడతాయనే భావన ఉంటుందో, ఎలా తప్పించుకోవాలనే జాగరూకతతో అప్రమత్తంగా ఉంటామో అలా మీ మీద నిష్కారణంగా అపనిందలు పడతాయి. వ్యాధి వచ్చాక కొంతకాలం పాటు బాధని అనుభవించాక ఎలా వ్యాధి పూర్తిగా నయమౌతుందో అలాగే ఈ తాత్కాలిక అపనిందలు తప్పవు. విజయమూ స్వచ్ఛమైన వ్యక్తిగా గుర్తింపు కూడా తప్పవు మీకు. చంద్రుడంతటి వానికీ, ఆ చంద్రునికి కాంతినిచ్చే సూర్యునికీ కూడా గ్రహణం తప్పదు.

ఏనుగంతటి బలిష్ట జంతువుకి వేటగాని వల్ల బంధనం తప్పదు. ఇది కూడా అంతే! అందుకని నిరుత్సాహమే తమ ఆస్తిగా కల్గి ఉన్న వ్యక్తుల్ని రానీయకండి. వారితో సమయాన్ని గడపకండి. ఓదార్పూ పరామర్శలకి స్థానాన్ని ఇచ్చుకోకండి. అన్నిటికీ మించి ‘విషయం ఎంతవరకు వచ్చింద’ని అడిగితే వారికి చిరునవ్వునే సమాధానం ఇవ్వండి. సొమ్ముతో సొమ్ము వ్యాపారం (చిట్‌ఫండ్స్‌ వంటివి) చేసేవారికీ, ఇళ్లు కట్టి అమ్మడం, వడ్డీ వ్యాపారం చేసేవారికీ న్యాయస్థానాల వరకూ విషయాలు పాకే అవకాశముంది కాబట్టి ఎవరినీ తక్కువ అంచనా వేయకుండా ఎప్పటి పనిని అప్పుడు ముగించుకుంటూ ఉండడం అవసరం.

సాధ్యం కాదనిపిస్తే వారివద్దకే వెళ్లి చెప్పి ఒప్పించుకోవడం తప్పనిసరి. మొగమాట భయం సిగ్గూ.. వంటివి పడితే ఊబిలో దిగడం తప్పదు. అయినా పరిష్కారమార్గం తెలిపినప్పుడు కష్టాన్ని ఆహ్వానించుకోవాలా? ఎందుకు? బుధ రాహువులు 7వ యింట ఉన్న కారణంగా వ్యసనానికి బానిసయ్యే ప్రమాదముంది. అప్పటికే వ్యసనపరులుగాని అయ్యుంటే మరింత వ్యసనపరులయ్యే ప్రమాదముంది. దానివల్ల ఇబ్బందులు మూడురెట్లు అవుతాయి. మానెయ్యండి.

లౌకిక పరిహారం: పరిష్కారం దిశగా నడవండి. సిగ్గూ అభిమానం, భయం వద్దు.
అలౌకిక పరిహారం: మన్యుసూక్తంతో హోమం మంచిది.

కుంభం  (జనవరి 20 – ఫిబ్రవరి 18)

సంస్కృతంలో ఓ సామెత ఉంది. ‘యావత్‌ తైలం తావత్‌ వ్యాఖ్యానమ్‌’ అని. గురువుగారు పాఠం చెప్తుంటే శిష్యుడడిగాడుట – ‘గురువుగారూ! ఇంకెంతసేపు పాఠం ఉంటుంద’ని. గురువుగారు బదులు పలుకుతూ – ‘ఈ నూనె దీపంలో నూనె ఎంత సేపుండి దీపం వెలుగుతూ ఉంటుందో అంతసేపూ పాఠం ఉంటుంద’ని. అదే తీరుగా మీరెంతగా శ్రమిస్తే ప్రయత్నాలని విరమించుకుంటే ఉంటే అంతకి అంత ఫలితాన్నీ పొందగల అదృష్టకాలం ఇది మీకు. ఈ సమయంలో కొద్దిగా బద్ధకిస్తే బద్ధకానికి అలవాటుపడిన శరీరానికి చురుకుదనం రాకపోవచ్చు. శరీరానికి బుద్ధి చెప్పండి.

ఆధ్యాత్మిక ధోరణి ప్రవేశించి దానాలూ ధర్మాలూ చేయాలనీ తీర్థయాత్రలకి వెళ్లాలనీ అనుకుంటారు. పైన అనుకున్నట్టుగానే ఎంత ఖర్చు చేయాలో ఆ అనుకున్న సొమ్మునీ అనుగుణంగానే దాన ధర్మాలని చేయండి తప్ప శ్రుతిమించడం సరికాదు. బెల్లం ఉన్నబోటికే చీమలు వస్తాయన్నతీరుగా జలాశయమున్న చోటికీ ఏనుగులు స్నానం చేయడానికి వస్తాయనీ మనకు తెలుసు.

అదే తీరుగా పచ్చగా ఉన్న మీ వద్దకి ఆప్తులూ బంధువులూ మిత్రులూ.. వచ్చి ఏదో కొంత ఆర్థిక సహాయాన్ని గాని, అప్పుగాని అడుగవచ్చు. అడిగే వీలుంది. మీకూ వారికీ మధ్య ఓ ముఖ్యగౌరవప్రదమైన వ్యక్తి హామీని తీసుకుని మాత్రమే రుణాన్ని ఇయ్యండి. రుణాన్ని తీర్చబోయే సమయాన్ని దృఢం చేసుకుని మరీ ఇయ్యండి. ఒక శుభవార్తని వినే వీలుంది. కుటుంబసభ్యుల్లో ఒకరిది తీవ్రవ్యాధి అనుకున్నది. సామాన్యవ్యాధిగానే గుర్తింపబడి చక్కని ఊరట కల్గుతుంది.

లౌకిక పరిహారం: శ్రమించండి. ఫలితాన్ని పొందండి. శుభవార్తకి సిద్ధంగా ఉండండి.
అలౌకిక పరిహారం: ఆంజనేయస్తుతిని చేస్తూ ఉండండి.

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)

వెనుక ఉన్నవారంతా వెడితే మనం మన ఏ ప్రయత్నమూ లేకుండా అప్రయత్నంగా ముందుకి వెళ్లిపోతామో, అకస్మాత్తుగా వచ్చిన వరదనీరు ఇక్కడున్న నీటిని బలంగా నెట్టి దూరంగా వేగంతో ప్రవహించేసేలా చేస్తుందో అలా మీ ప్రయత్నం లేకుండానే ఓ మంచి ఇల్లు గాని స్థలంగాని కొనుక్కునేందుకై అవకాశం మీ ఆప్తులద్వారా వస్తుంది. ఏ మాత్రపు అవకాశమున్నా జారవిడుచుకోకండి. ఈ తొందరలో సరైన పత్రాలూ పరిశీలనా అమ్మే వ్యక్తులూ వాళ్ల నిజాయితీతనం వంటివి విచారించుకోవడం అత్యవసరం.

గులాబీని కోస్తుంటే ముల్లుని ఎలా చూసుకుని కొయ్యాలో అలాగే కొనుక్కుంటున్నామనే ఆనందంలో వీటిని మరువకండి. ప్రమత్తంగా ఉండకండి. తేడా జరిగితే న్యాయస్థానాల దాకా విషయం జరిగిపోతుంది. గురువు 8వ ఇంట ఉండడం ఇతర గ్రహాల అనైక్యం దీనిక్కారణం. సంతానానికి సత్ఫలితాలు చదువులో లభించకపోవచ్చు. కళాశాలా ప్రవేశం కూడా దగ్గరలో ఉండకపోవచ్చు. అందరి సూచనలనీ సలహాలనీ పాటిస్తూ విదేశానికి పంపించదలచడం ప్రస్తుతానికి సరికాదు.

ఆలోచించుకోండి. వ్యాపారంలో లెక్కలకి సంబంధించిన అన్ని పత్రాలనీ స్పష్టంగాను, అవగాహనతోనూ ఉండేలా చూసుకోండి. ప్రభుత్వపరమైన దృష్టీ, ప్రత్యర్థుల దృష్టీ మీ మీద ఉందని గ్రహించుకోండి. అత్యాశకి పోయి లాభాలని అధికంగా ఎందరో పొందుతున్నారనే ఊహతోనో నిషిద్ధ వస్తువులని కొనకండి. అమ్మే ప్రయత్నం చేయకండి. అలా అమ్మేవారి ద్వారా రాయబారాలు చేయకండి. సరైన కాలం కాదు మీకు. భార్య/భర్త అనారోగ్యానికి సకాలనిద్రా సకాల భోజనం లేకపోవడమే కారణమని గ్రహించి సమస్యని పరిష్కరించుకోడి.
లౌకిక పరిహారం: నిషిద్ధ వస్తువుల జోలికి పోకండి.
అలౌకిక పరిహారం: శ్రీ విష్ణు సహస్రనామ పఠనం మంచిది.

డా‘‘ మైలవరపు శ్రీనివాసరావు
జ్యోతిష్య పండితులు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top