విధి నిర్వహణలో అధికారి మృతి

An officer killed in duty - Sakshi

సిద్దిపేట జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి హఠాన్మరణం 

సిద్దిపేటజోన్‌: సిద్దిపేట జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి అంజయ్య విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుకు గురై మృతిచెందారు. బుధవారం పత్తి మార్కెట్‌లో ప్రభుత్వం మత్స్యకారులు, గొర్రెల కాపరులకు వివిధ పథకాల కింద వాహనాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న అంజయ్య (56) మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా సభావేదిక ప్రాంగణంలోనే కుప్పకూలారు. పక్కనే ఉన్న యాదవ సంఘం నాయకులు ఆయనను ఎంపీ ప్రభాకర్‌రెడ్డి వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారు.

విషయం తెలిసిన మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని అంజయ్య భార్య రాణిని పరామర్శించి ధైర్యం చెప్పారు. మృత దేహాన్ని తరలించడానికి అవసరమైన ఏర్పాట్లను హరీశ్‌రావు స్వయంగా పర్యవేక్షించారు. అంజయ్య మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సందర్శించారు. శుక్రవారం పట్టణంలోని వైకుంఠధామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిసింది. జనగామ జిల్లా కీలాసపూర్‌ గ్రామానికి చెందిన అంజయ్య ఎనిమిదేళ్లుగా జిల్లాలో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్నారు. ఒక మంచి అధికారిని కోల్పోయామని.. అంజయ్య మరణం తనను తీవ్రంగా కలచి వేసిందని మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top